ముప్పుల్లో వర్సిటి అటానమీలు

- వూషమల్ల కృష్ణ

     కుల, మత, ప్రాంత భావాలు అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని చూపిస్తున్న నేటి సమాజంలో ఉన్నత విద్యకు సంబంధించిన కొత్త చట్టం మీద సమగ్ర చర్చ జరగ వలసిన అవసరం ఉంది. చర్చకు కేవలం పది రోజులు సరిపోవు. గడువు పొడిగించాలి. అన్ని కోణాలలో విశ్లేషించి శాస్త్రీయ ప్రణాళికలతో సమగ్ర చట్టాన్ని తీసుకురావాలి.  

 

    విశ్వ విద్యాలయాల నిధుల సంఘాన్ని (యునివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ యుజిసి) 1953లో స్థాపించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో ఎలాంటి ప్రభుత్వ జోక్యం గాని, రాజకీయ జోక్యం గాని ఉండకూడదనే సత్సంకల్పంతో అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ స్వయం ప్రతిపత్తితో కూడిన యుజిసి స్థాపనకు పూనుకున్నారు. ఆ రకంగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల రోజు వారి వ్యవహారాలలో ప్రభుత్వ లేదా రాజకీయ జోక్యాన్ని నివారించే ప్రయత్నం చేశారు. నిజానికి మదన్ మోహన్ మాలవీయ లాంటి వారు కూడా విద్యా రంగాన్ని ప్రభుత్వ శాఖగా పరిగణించ కూడదని భావించారు. విశ్వ విద్యాలయాలలో రాజకీయ జోక్యాన్ని నివారించడం కోసం 1956లో యుజిసి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 1956 నుంచి నేటి వరకు విశ్వ విద్యాలయాల గ్రాంట్ల సంఘం దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు అవసరమైన నిధులను సమకూరుస్తూ, తగు మార్గదర్శకాలను అందిస్తూ ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా నిలబడుతూ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కూడా కాపాడుతూ వచ్చింది.

 

    అయితే, గత నెల 27న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం యుజిసి స్థానంలో ‘భారత ఉన్నత విద్యా కమిషన్‌ (HECI)’ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, దాని మీద విద్యావంతులు, ప్రజలు జులై 7 లోపల సూచనలు సలహాలు ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. యుజిసి స్థానంలో ‘భారత ఉన్నత విద్యా కమిషన్‌’ ఏర్పాటు చేసి ప్రస్తుత విద్యా వ్యవస్థను సమగ్ర ప్రక్షాళన చేయాలనేది ప్రథమ ఉద్దేశ్యం. ఈ ప్రక్షాళన నేపథ్యం గాని, చారిత్రక అవసరం గాని డ్రాఫ్టులో స్పష్టం చేయలేదు. అలాగే ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించడం గాని, సవాళ్ళ గురించి చెప్పడం గాని, వాటిని పరిష్కరించే మెరు గైన పద్ధతుల గురించి చర్చ గాని ఎక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే మారుతున్న పరిస్థితులలో ఉన్నత విద్యకు సంబంధించిన ‘దృక్పథం’ ప్రతిపాదిత బిల్లులో కనిపించదు.

 

    అయినప్పటికీ ఈ ప్రతిపాదిత బిల్లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ బిల్లు చట్టంగా మారితే రాబోయే రోజుల్లో ఉన్నత విద్యా రంగాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఈ బిల్లు మీద దేశంలోని 850 విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తి, 40,000 పైగా ఉన్న కాలేజీల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరో రకంగా చెప్పాలంటే దేశంలో ఉన్నత విద్య భవిష్యత్తును నిర్ణయించే, శాసించే డ్రాఫ్టు బిల్లు ఇది. అందుకే విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనంలో ఉంచుకోవాలి. విశ్వ విద్యాలయ నిధుల సంఘం పని తీరు గురించి అనేక విమర్శలు ఉన్నాయి. ఫేక్ యూనివర్సిటీలను అరికట్టడంలో విఫలమయిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దాని పరిధిని విస్తరించాలని, విశ్వ విద్యాలయ నిధుల సంఘం 1956 చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతున్న మాట వాస్తవమే. 2006, 2009 సంవత్సరాలలో కొన్ని కమిటీల ప్రతిపాదనలు వచ్చాయి. 2005లో National Knowledge Commissionని స్థాపించాలనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. 2008లో ప్రముఖ శాస్ర్తవేత్త, విద్యావేత్త యశ్‌పాల్‌ నేతృత్వంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ National Commission for Higher Education and Researchని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఇవేవి కార్య రూపం ధరించ లేదు. ఈ నేపథ్యంలో నుంచే ప్రస్తుత ప్రతిపాదన వచ్చిందని భావించ వచ్చు.

 

    యుజిసి పని విధానంలో సంస్కరణలు తీసుకు రావాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. అయితే ప్రస్తుతం ప్రతిపాదించిన డ్రాఫ్టులో పొందు పరచిన కొన్ని అంశాల పట్ల సానుకూలత ఉన్నప్పటికీ మరికొన్ని అంశాల పట్ల తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, ఇప్పటివరకు దేశంలోని విశ్వ విద్యాలయాలకు యుజిసి నిధులను సమకూరుస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రతిపాదించిన భారత ఉన్నత విద్య కమిషన్‌కు ఈ అధికారం ఉండదు. ఇక ముందు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ బాధ్యతను తీసుకుంటుంది. ఇప్పటి వరకు నిధులు ప్రభుత్వమే కేటాయించినా వాటి పంపిణీ మాత్రం స్వయం ప్రతిపత్తితో ఉన్న విశ్వ విద్యాలయ గ్రాంట్ల సంఘం చేసేది. ఇక ముందు విశ్వ విద్యాలయాలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా నిధులను సమకూరుస్తుంది కాబట్టి విశ్వవిద్యాలయాల మీద ప్రత్యక్ష నియంత్రణ కూడా ప్రభుత్వానిదే అయి ఉంటుంది. ఆ రకంగా విశ్వ విద్యాలయాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోయే అవకాశాలు ఎక్కువ. రెండో అంశం. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అధ్యక్షతన భారత ఉన్నత విద్య కమిషన్‌ సలహా మండలి పని చేస్తుంది. ఒక వైపు రాజకీయ జోక్యం ఉండదని చెపుతూనే మరో వైపు నిధుల పంపిణీని, ఉన్నత విద్య నియంత్రణ వ్యవస్థలను ప్రత్యక్షంగా ప్రభుత్వం తమ అధీనంలోకి ఈ చట్టం ద్వారా తీసుకుంటుంది. అంతే కాకుండా విశ్వవిద్యాలయాల రోజువారీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి భారత ఉన్నత విద్య కమిషన్‌కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తుంది. ఏ విద్యా సంస్థనైనా స్థాపించే లేదా మూసి వేసే అధికారం ఈ కమిషన్‌కు కట్టబెట్టడం జరుగుతుంది. సిలబస్‌ మొదలు బోధన, పరిశోధనలకు సంబంధించిన అన్నీ విషయాలను కొత్త కమిషను పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ప్రయివేటు రంగంలో విద్యావ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండగా, రాబోయే రోజుల్లో ఉన్నత విద్యను పూర్తిగా కార్పొరేటికరణ చేసే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది.

    కుల, మత, ప్రాంత భావాలు అన్ని రంగాలలో ఆదిపత్యాన్ని చూపిస్తున్న నేటి సమాజంలో ఉన్నత విద్యకు సంబంధించిన కొత్త చట్టం మీద సమగ్ర చర్చ జరగ వలసిన అవసరం ఉంది. అందుకోసం పది రోజులు సరి పోవు. సమయం పొడిగించాలి. అన్ని కోణాలలో విశ్లేషించి శాస్త్రీయ ప్రణాళికలతో సమగ్ర చట్టాన్ని తీసుకు రావాలి. దేశంలో ఉన్నత విద్యను అందుకోవడంలో యువత ఎంతో వెనుకబడి ఉంది. కేవలం ఇరవై ఐదు శాతం యువత కూడా ఈ రోజు ఉన్నత విద్యను అందుకోలేక పోతున్నారంటే మన పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ‘అందరికీ విద్య-–అందరికీ ఉపాధి’ అనే నినాదం నెరవేరడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో ఉహించలేం.

 

    ఏ దేశంలోనైనా ఉన్నత విద్య లక్ష్యం– ఆ దేశ పౌరుల అధ్యయన అవసరాలు, అవకాశాలు, ఆకాంక్షలు జీవితాంతం నెరవేరే విధంగా ఉండాలి. ప్రజల మేధో సామర్థ్యాలను, అభిరుచులను పెంపొందించే విధంగా, వారు తమ కాళ్ళ మీద తాము నిలబడి సమాజం కల్పించే అవకాశాలను ప్రతిభా పాటవాలతో అందిపుచ్చుకునే విధంగా ఉండాలి. సమాజంలో సమ న్యాయం, ఉత్పత్తిలో సమ భాగస్వామ్యం, సమాన పంపిణీ వ్యవస్థ కోసం పౌరులందరూ పాటు పడేందుకు ఉన్నత విద్య ప్రేరణ కావాలి. జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా నిర్మాణాత్మక పాత్ర పోషించేవారుగా పౌరులు రూపొందాలి. సమాజ పురోగతి కోసం అవసరమైన పాలసీలను, పద్ధతులను అవలంబించే శక్తి సామర్థ్యాలు కలిగే ఉండే పౌరులను ప్రోత్సహించే విధంగా స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించే విద్యా సంస్థలు ఉండాలి.

 

 ఆచార్య వి. కృష్ణ

05.07.2018

ఆంద్రజ్యోతి

 

Comments

Popular posts from this blog