ఆఖరి మనుషుల బహిరంతర ఆవిష్కరణే "అవతలి గుడిసె"

హిందీ మూలం నుంచి తెలుగులోకి అనువాదమైన నవల #అవతలి_గుడిసె హిందీలోని జయప్రకాష్ కర్థం 28 ఏళ్ల కిందట రాసిన నవలని తెలుగులోకి ప్రొ.వి కృష్ణ అనువాదం చేశారు.. కళ్యాణ్ రావు ఒక సందర్భంలో కవిత్వం గురించి రాస్తూ "మనతో సంభాషించేది మన ఒంట్లోని నెత్తుటి వాగుల్లో ఆటుపోట్లను సృష్టించేది కవిత్వమంటాడు"ఈ మాటలు కేవలం కవిత్వానికే కాకుండా నవల, కథ , వంటి ఏ సాహిత్య ప్రక్రియకైనా వర్తిస్తాయని అంటే అతిశయోక్తి కాదు...

అవతలిగుడిసె ఆ విధంగా మనతో సంభాషించే నవల.లోని ఉద్రేకాల్ని పరుగులు పెట్టించే నవల.. ఈ నవల దళితుల జీవితాన్ని ,పోరాటాన్ని ,వారు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న పీడన, అణచివేత, దరిద్ర్యాన్నికళ్ళ ముందర బొమ్మ కట్టి చూపిస్తుంది. గంగా నది తీరాన ఉత్తరప్రదేశ్లోని మాతాపూర్ గ్రామం లో మొదలయ్యే ఈ నవల మొత్తంగా దేశంలోని దళిత జీవనాన్ని అందులోని ప్రతిఘటనను, ప్రేమను, వాళ్ల స్వేచ్ఛను గురించి ఇముడ్చుకుని మనతో సంభాషిస్తుంది సుక్ఖా, రమియా ఇద్దరు నిరుపేద దళిత దంపతులు వారికి ఒక్కగానొక్క కొడుకు చందన్. ఆ ఊరి భూస్వామి ఠాకుర్ హర్నాo సింగ్ విపరీత ఫ్యూడల్ మనస్తత్వం కలవాడు. నరనరాన కుల ఆధిపత్య స్వభావాన్ని జీర్ణించుకున్న వాడు.ఆయన కూతురే రజిని . చందన్ కు బాల్య స్నేహితురాలు

ఇవి ఈ నవలలోని ప్రధానమైన పాత్రలు.

దళితుడైన సుక్కా కుటుంబం మీద ఠాకూర్,మరియు మెల్ల కన్ను పురోహితుడి రూపంలో భూస్వామ్యం మనువాదం జమిలిగా చేసిన దాడిలో సుక్కా కుటుంబం తీవ్రంగా ప్రభావితం అవుతుంది.అందుకు కారణం చందన్ తండ్రి పన్ను కట్టకపోవడం, ప్రధానంగా అంతకుమించి మాదిగవాడు అయినప్పటికీ ఆ గ్రామంలో అందరికన్నా ఎక్కువగా తన కొడుకైన చందన్ ను పెద్ద చదువులు చదివించడం . అదే వాళ్ళ ఆగ్రహానికి అసలు కారణం మరోవైపు చందన్ పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన ఆ ఊరి భూస్వామి కూతురు రజిని సామాజిక అస్తిత్వాన్ని అధిగమించిన చైతన్యం ఆమెది..

ఒక సందర్భంలో....." మాదిగోళ్ళు ఎరకలి వాళ్ళు అందరూ చదివి ఉద్యోగాలు చేస్తే రేపు మన పొలాల్లో ఇళ్లలో ఎవరు పనులు చేస్తారు" అన్న అన్న తండ్రికి..."ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం అవుతున్నారు సమాజంలో ఉద్యమం రూపు దాలుస్తోంది కాలాన్ని బట్టి మీరు మారండి లేకుంటే హింస జరుగవచ్చు.ఇంత పెద్ద సముదాయం ఆక్రోశాన్ని అణిచివేయడం కష్టమౌతుంది" అని తండ్రికి నిర్మొహమాటంగా చెప్పిన కూతురు రజినిది ఓ మానవీయమైన పాత్ర ఈ నవలలో ఓ వైపు చందన్ మరోవైపు రజిని సహజంగానే ఇద్దరి కల, ఇద్దరి తపన, అంతరాలు లేని అసమానతలు లేని, నిర్దిష్టంగా కులం అనే ఉన్మాదం లేని సమాజం. దానికోసం వాళ్ల ఆచరణ, శ్రమ, ఇద్దరి తాదాత్మ్యం, సంఘర్షణ ,రచయిత జీవితానికి దగ్గరగా ఉండేలా ఆవిష్కరించాడు .బాల్యం నుంచి కూడా వాళ్లు పంచుకున్న స్నేహం అభిమానం గౌరవం ఈ నవలలో ప్రధానంగా ఆకర్షణీయం. చర్యకు ప్రతిచర్య ఉన్నట్టు చదువుకోవడానికి పట్టణం పోయిన చందన్ చదువుతో పాటు సమాజాన్ని మార్చే పనిలోకి దిగాడు అనివార్యంగా. ఆయనే స్వచ్ఛందంగా బడులను స్థాపించి విద్యను అందించాడు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని మనుషుల్ని ప్రభావితం చేస్తూ వాళ్లకు ధిక్కారం నేర్పుతాడు .మూఢవిశ్వాసాలను వదిలించడం మొదలుపెడతాడు. శాస్త్రీయమైన ఆలోచనల్ని సామాజిక బాధ్యతను వాళ్లలో రేకెత్తిస్తాడు.

ఫలితంగా స్వేచ్చా సమానత్వ కాంక్ష రెట్టింపై ఉద్యమం తీవ్రంగా మారుతుంది. ఆ సెగ తన సొంత ఊరికి సైతం తగులుతుంది.ఇప్పుడు గ్రామాల్లోని దళితులు, కూలీలు, పేదలు ,దొరల చేత అగ్రకులాల చేత బహిష్కరింపబడిన వారు, చైతన్యవంతమై ఇప్పుడు దొరలను అగ్రకులాల కట్టుబాట్లను వ్యతిరేకించి బహిష్కరించడం మొదలుపెడతారు. ఇక్కడే ఈ నవల 1970- 1980ల మధ్య తెలంగాణలోని సిరిసిల్ల జగిత్యాల పోరాటాల్ని గుర్తుకు తెస్తుంది. ఇక్కడ తెలంగాణలో "కాలి కింది దుమ్ము కళ్లల్లో పడితే" అగ్రకుల దొరల బతుకుల్లో  ఏం జరిగిందో ఈ నవలలోని మాతాపూర్ మరియు పరిసర గ్రామాల్లో కూడా అదే జరిగింది.

"తొడ మీద నిప్పు పడితే రంగడు వచ్చి తీయాలి" అనే అహంకారం, ప్రజల వెట్టిచాకిరి వ్యతిరేక ఉద్యమం ద్వారా నశించిపోయింది.  మాతాపూర్ లో అయితే ఒక్కొక్కరు మెల్లకన్ను పురోహితుడు మొదలు ఠాకూర్ హర్నాo సింగ్ చుట్టూ ఉండే దుష్ట శక్తులు  ఊరిని వదిలి పెడతారు. ఠాకూర్ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలకు క్షమాపణ చెప్పి తన భూముల్ని దానం చేసి ,చిన్న పూరి గుడిసెలోకి మారి సాధారణమైన జీవితం గడిపేంతగా పరివర్తన చెందుతాడు .ఆ పరివర్తనకు కారణం ఆ గ్రామంలోని దళితుల చైతన్యం ఉద్యమం. ఆ ఉద్యమం ద్వారా ప్రభావితమైన ఆయన కూతురు రజనీ హితబోధ. ఈ మార్పులకు కారణమైన సంచలనాలన్నిటినీ  ఈ నవలలో తప్పకుండా చదవాలి.

ఈ నవల కుల దాష్టికం తోపాటు నగరంలో చందన్ కు ఆశ్రయమిచ్చిన కమల( క్రూరమైన లైంగికదాడి బాధితురాలు) ఆమె కొడుకు కిల్లర్ .తండ్రి హరియా పాత్రల ద్వారా మనుషుల్లో ఉండాల్సిన మానవత్వాన్ని సహానుభూతిని చర్చిస్తుంది మనతో. పైగా కమల పాత్ర ద్వారా దళిత మహిళల మీద నిత్యం జరిగే లైంగిక దాడులు , ఈ దాడులు జరిగినప్పుడు చట్టం న్యాయం అనేవి ఎలా మడి గట్టుకొని ఉంటాయో ఈ పాత్రల ద్వారా వాస్తవికంగా చిత్రీకరించాడు. చందన్౼కమల౼ హరియా ౼కిల్లర్ ల మధ్య చోటు చేసుకున్న సంభాషణలు గుండె మీద ఎదో బరువుని కుంభవృష్టిగా కుమ్మరిస్తాయి. చివరకు ఉద్యమంలో భాగంగానే చందన్ ను కాపాడుకోవడానికి కమల ఒక దాడిలో తన ప్రాణాలను ఒడ్డుతుంది...

అనంతరం ఒంటరిగా మిగిలిన కిల్లర్(కమల కొడుకు) చందన్ రజినిల ప్రేమ మధ్యలో కి రావడం ఇదంతా ఎక్కడా కృత్రిమత్వం లేని బతుకు పాటలా పోరాటంలా సహజంగా సాగుతుందీ నవల. అయితే పాత్రోచిత భాష లేకపోవడం, మార్పు కోసం చందన్ చేస్తున్న పోరాటం అతని గొంతు ద్వారా ఎక్కువ మొత్తంలో వినిపించకపోవడం ఈ నవలలో ఓ పరిమితిగా చెప్పవచ్చు. అయినప్పటికీ అంటరాని మనుషుల ఆరాట పోరాటాలు ,ఆత్మగౌరవాలు, వ్యధలు, ఎవరికీ తలవంచని దిక్కారాలు ,మార్పు కోసం నిక్కచ్చిగా నిలబడే నిబద్ధతలు, అన్నీ కలగలసిన అవతలి గుడిసె నిజంగా ఆఖరి మనుషుల బహిరంతర ఆవిష్కరణ....

ఈ పుస్తకాన్ని చదువుతారని ఆశిస్తూ...

-suryachandra.DG

 


Comments

Popular posts from this blog