మనిషిని పండించేవి పొలాలే

వూషమల్ల కృష్ణ

కేదార్‌నాథ్‌ సింగ్ కవితలు స్పష్టంగా, సరళంగా, సహజంగా మామూలు భాషలో ఉంటాయి, కవితలు ఎంత సహజంగా, సరళంగా ఉంటాయో అంతే లోతైన భావాలను వ్యక్తం చేస్తాయి. మనిషిని ఉన్నతీకరించడంతో బాటు ప్రపంచ సౌందర్యాన్ని మానవీయ కోణంతో ఆవిష్కరించిన మహా కవి; మాటలనే కవితలుగా మలచిన మహా శిల్పి కేదార్‌నాథ్‌ సింగ్‌. ‘మాట్లాడుతాను, అందుకే రాస్తాను’ అని సగర్వంగా ఆయన ప్రకటించారు.

 

ఆధునిక హిందీ కవితా ప్రపంచంలోనే కాకుండా భారతీయ సాహిత్యంలోనూ తన కవితలతో ఒక ప్రత్యేకతను చాటిన మహాకవి కేదార్ నాథ్ సింగ్ ఇక లేరు. ఈ నెల 21 వ తేదీ ( సోమవారం) రాత్రి అనారోగ్యంతో ఆయన డిల్లీలో మరణించారు. 2013 సంవత్సరానికి గాను దేశంలోనే సర్వోన్నత సాహిత్య గౌరవం, అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భారతీయ జ్ఞానపీఠ్‌ అవార్డు’ను పొందిన ప్రశస్థ కవి కేదార్ నాథ్ సింగ్. హిందీ సాహిత్యంలో జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని పొందిన వారిలో కేదార్‌ నాథ్‌ పదవ వ్యక్తి.

 

        ఈ మహాకవి ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో చకియా గ్రామంలో 1934 లో జులై ఒకటిన జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ., పిహెచ్. డి పట్టాలు పొందారు. బలియాలో కొంత కాలం అధ్యాపకుడుగా పనిచేసిన తరువాత న్యూఢిల్లీ లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో భారతీయ భాషా కేంద్రంలో ఆచార్యుడిగా, విభాగాధిపతిగా కేదార్‌నాథ్‌ సింగ్‌ పని చేసారు. ఆయన సృజనాత్మక సాహిత్య యాత్ర 1950 నుంచే ప్రారంభమైంది. మొదటి కవితా సంకలనం ‘అభి బిల్కుల్ అభి’ 1960లో అచ్చయింది. తదనంతరం ‘జమీన్ పక్ రహీ హై’, ‘యహాం సే దేఖో’, ‘అకాల్ మే సారస్’, ‘బాఘ్’, ‘ఉత్తర్ కబీర్ ఔర్ అన్య కవితాయే’, ‘తాల్ స్తాయ్ ఔర్ సైకిల్’ ల్లాంటి కవితా సంకలనాలు వారి కలం నుంచి వెలువడ్డాయి.

    కేదార్ నాథ్‌ సింగ్‌ తన కవితలలో ‘మనిషి’ని వెతుకుతారు. ‘మనిషి’ ని ప్రతిష్టించాలనుకుంటారు. కవిత్వం పదాలలో బందీ అయిందనో లేదా పదాల వ్యాకరణానికి పరిమితమయిందనో కేదార్‌నాథ్‌ సింగ్ భావించరు . ‘భాష వచ్చిన వారు ఎందుకు మౌనంగా ఉన్నారని’ ఓ కవితలో ఆయన ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలో కేదార్ నాథ్ సింగ్ మనిషిలోని జవాబుదారీతనానికి పర్యాయపదంగా భాషను చూస్తారు. భాష మనిషి అస్తిత్వానికి చిహ్నం అని ఆయన భావిస్తారు. అందుకే అందులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. ‘చల్లదనంతో పదాలు మరణించవు, సాహసలేమితో అవి మరణిస్తాయి’ అని మరో కవితలో ఆయన అంటారు. పదాలు నిజానికి మనిషికి పర్యాయపదం. మనిషి అంటే ఇక్కడ చైతన్యంతో ఉండే మనిషి. బ్రతికున్న మనిషి.

 

    బ్రతుకు ఇక్కట్లను, ప్రకృతి, జీవితంలో సరితూగని సంబంధాల వైరుధ్యాలను ఎదుర్కొనే ధైర్య, సాహసాలు కలిగి ఉండే మనిషి. ‘మిత్రులకు చెప్పాను, మౌనంగా ఉంటే ఏమీ లాభం లేదని, పొలాల వైపు పరుగెత్తాను, పదాలు ఎక్కడైనా పండి పోయాయేమోనని’ కవి అంటారు. మాట్లాడితేనే భాషకు సార్థకత. మాట్లాడితేనే వ్యక్తుల వ్యక్తిత్వం బయట పడుతుంది. అందుకే కవి పదాల పరిస్థితిని తెలుసుకోవడానికి పొలాల వైపు పరుగెత్తుతారు. పొలాలలో పదాలు పండుతాయని కవి ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ కూడ పదాలు మనిషికి పర్యాయపదమే. మనిషిని పండించేవి పొలాలే. పండించి మనిషిని సుదృఢ పరచేవి పొలాలే. కీర్తి, కిరీటాలతో ముంచెత్తేవి పొలాలే. ‘పండిన ధాన్యం లోపల పదాలు ఉండే పూర్తి అవకాశం ఉండేది’. ధాన్యం పండడం ఒక జీవన ప్రక్రియ. పదాలు కూడ జీవితాన్ని విస్తరింపజేస్తాయి. అయితే అన్నీ పదాలు కాదు. బ్రతుకు కొలిమిలో, శ్రమ వేడిలో, మట్టి శక్తిలో పండిన పదాలు మాత్రమే జీవితాన్ని విస్తరించగలవు. అలాంటి పదాల రహస్యాన్ని పొందడం కోసం ధాన్యం లోపల ప్రవేశించి అమ్మ గొంతును వినడానికి ఇసురు రాయి క్రిందకు వెళ్ళడానికి కవి ఆతురత పడతారు. కవిత్వం, భాష, జీవితం, మనిషి, మానవీయ పురుషార్థం, ప్రజాస్వామ్య కర్తవ్యం వీటన్నిటినీ ఒకేసారి రంగరించి వ్యక్తం చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒక మహాస్వాప్నికుడు, క్రాంతి ద్రష్టకు మాత్రమే అది సాధ్యం.

 

    మహోన్నత పోరాటం తరువాత దేశం దాస్య శృంఖలాలను తెంచుకుని స్వాతంత్ర్యం పొందింది. వలసపాలకుల కబంధ హస్తాలనుంచి దేశం విముక్తమయిన చారిత్రక సందర్భంలో ఒక నూతన భవిష్యత్తు నిర్మాణం కోసం సృజనాత్మక ఆలోచనలకు అంకురార్పణ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్న సమయంలో కేదార్ నాథ్ సింగ్ యువ గొంతుకతో ఆధునిక హిందీ కవిత్వ రంగంలో ప్రవేశిస్తారు. కొత్త భవిష్యత్తు నిర్మాణం కోసం పరితపిస్తున్న ‘మనిషి’ ప్రతినిధి అయిన కవి బజారు నుంచి దేశ పటాన్ని కొంటారు. రైతు బిడ్డ అయిన కవి దేశ పటంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినా తన ఇల్లు కనబడదు. ‘ప్రపంచపు గొప్ప పటంలో, దొరక లేదు, దొరక లేదు నా ఇల్లు’. మరి ఆ ఇంటి ముంగిట్లో ‘అమ్మ రెండు తులసి మొక్కలను పెంచింది, నాన్న ఊడల మర్రి చెట్టును’. ఈ పంక్తులు స్వతంత్ర భారత దేశ వాస్తవికతను ఆవిష్కరిస్తాయి.

 

    స్వతంత్ర భారతదేశపు వైరుధ్యాలతో గతం, భవిష్యత్తు తలపడినప్పుడు ఉద్భవించే ప్రశ్నలు కేవలం వ్యక్తి వరకు పరిమితం కాకుండ మొత్తం సమాజాన్ని కదిలిస్తాయి. సామాజిక బాధ్యతను గుర్తెరిగిన కవి వైరుధ్యాలకు, వ్యక్తిగత పోకడలకు గురవ్వకుండ ప్రజలకు దిక్సూచిగా నిలబడుతాడు. ప్రశ్నిస్తాడు. ‘నన్ను నేను ప్రశ్నించుకుంటాను, నదిలో నిలబడిన వంతెన గొప్పదా? లేదా మనుషుల లోపల వ్రేలాడుతున్నది గొప్పదా? ఏది గొప్పది?’ కేదార్‌నాథ్‌ సింగ్ కవితలు అత్యంత స్పష్టంగా, సరళంగా, సహజంగా మామూలు భాషలో ఉంటాయి, కవితలు ఎంత సహజంగా, సరళంగా ఉంటాయో అంతే లోతైన భావాలను వ్యక్తం చేస్తాయి. ఇద్దరు మిత్రులు కలుసుకున్నప్పుడు పరస్పరం కరచాలనం చేస్తారు. ‘అతని చేయిని నా చేతిలోకి తీసుకుని ఆలోచించాను, ఈ ప్రపంచం కూడ అతని చేయిలాగే వెచ్చగ, అందంగా ఉండాలని’. ప్రపంచ సౌందర్యం ఒంటరితనంలో లేదు. మనుషుల పరస్పర కలయికలో ఉంది. కేదార్ నాథ్ సింగ్ తమ రచనల ద్వారా మనిషిని ఉన్నతీకరించడంతో బాటు ప్రపంచ సౌందర్యాన్ని మానవీయ కోణంతో ఆవిష్కరించిన గొప్ప కవి. మాటలనే కవితలుగా మలచిన మహా శిల్పి. ‘మాట్లాడుతాను, అందుకే రాస్తాను’ అని సగర్వంగా ప్రకటించారు.

ఆచార్య వి. కృష్ణ

24.03.2018

ఆంద్రజ్యోతి

 

 


Comments

Popular posts from this blog